Pages

Wednesday, August 24, 2011

జలకంబుల్

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము. 

No comments:

Post a Comment