Pages

Sunday, September 5, 2010

శ్రీవిద్యుత్కలితా

శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహా-జీమూతపాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! మీకరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ - శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. అది నాస్వభావముచేతను, నీయందు కల భక్తిచేతను, సాధనబలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి.

నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్షజలధారలు ఆ మేఘములనుండి వేగముగా పడనారంభించినవి. వాని తీవ్రతచేత నా హృదయపద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడ వగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము.

No comments:

Post a Comment