Pages

Sunday, September 5, 2010

వాణీవల్లభదుర్లభంబగు

వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క
ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా, నేను ఏ జన్మలోనో నీ విషయమై గొప్ప అపచారము చేసితిని. ఏమిటనగా సరస్వతీ పతియగు బ్రహ్మకు కూడా దుర్లభమైన నీ తోడి సాయుజ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలగు ప్రక్రియలు చేయక, బ్రహ్మాదులవలె నీ ద్వారమున నిల్చి నిన్ను అనుగ్రహింప చేసికొనక, నీ ఈశ్వరత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని (నిర్వాణశ్రీని) సాహసముతో చెరబట్ట తలచితిని.

ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి. నీ సన్నిధిలో ఉండి నీ కల్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండ చేసితివి. రాజులలోకెల్ల అధముడగు ఒకానొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి. ఈ దండననుండి విడుదల చేయుమయ్యా.

No comments:

Post a Comment