Pages

Sunday, September 12, 2010

ఆలుంబిడ్డలు

ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!



శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో!

No comments:

Post a Comment