Pages

Monday, August 22, 2011

నీరూపంబు

నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో
రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్!
నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను. పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ’ఇదిగో ఇట్టిది నారూపము’ అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము. 

No comments:

Post a Comment