Pages

Friday, August 26, 2011

కేదారాదిసమస్తతీర్ధములు

కేదారాదిసమస్తతీర్ధములు కోర్మింజూడఁ బోనేఁటికిన్
గాడా ముంగిలి వారణాసి! కడుపే కైలాసశైలంబు మీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞానల
క్ష్మీదారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఈ లోకులు ఉత్తమ జ్ఞానసంపద లేని దరిద్రులుగా ఉన్నారు. వీరికి వాస్తవమగు శివతత్వజ్ఞానము కాని నిన్ను ఉపాసించు యోగ్యత కాని లేదు. కొందరు నిన్ను దర్శించగోరి కేదారేక్షేత్రము మొదలగు సకలతీర్థములకు తీర్థ యాత్రలకు పోవుచున్నారు. వీరికి నీ తత్వము సరిగా తెలిసినట్లు లేదు. వారు వివేకముతో నిన్ను తమ హృదయములందే అంతర్ముఖదృష్టితో చూచి ఉపాసించగల్గినచో వారు తమ యిండ్లయందే ’వారణాసి’ అగును. వారి హృదయమే నీ నిత్య నివాసమైన కైలాసపర్వతమగును. నీ పాదములను సరిగా ధ్యానించగల యోగ్యత కలుగువారు నిన్ను దర్శించుటకై మరి ఎచ్చటికి పోవలసిన పనిలేదు. 

No comments:

Post a Comment