Pages

Wednesday, August 24, 2011

పాలుం బువ్వయుఁ

పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం
టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా. 

No comments:

Post a Comment