Pages

Friday, August 26, 2011

దంతంబు

దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

నిచ్చల్ నిన్ను

నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై
రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ
భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై
చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును. 

నీకుం గాని

నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.
 

క్షితినాధోత్తమ

క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా
నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్
ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి "ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట." అని చెప్పగా ఆ రాజు "అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు. 

తనయుం

తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి
ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే
ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే
సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు.
 

దురమున్

దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్
నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును.

లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత.

 

కరిదైత్యున్

కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ
శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో
పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే
సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు. 

నిను నిందించిన

నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో
చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం
బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా? 

పటవద్రజ్జుభుజంగవద్రజతవి

పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా
క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్
చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదాంత శాస్త్రము చదివియు (అ) కాలిన బట్టమడత వస్త్రమువలె ఉపయోగము లేని విధముగ జ్ఞాని కర్మేంద్రియములతోను జ్ఞానేంద్రియములతోను ప్రారబ్ధకర్మానుసారముగ వ్యవహరించుచున్నప్పటికి వాని యింద్రియములు శబ్ధ స్పర్స రూప రస గంధముల ననుభవించుట కుపయుక్తములు గాకుండుననియు, (ఆ) చీకటి వలన త్రాటి యందు సర్పభ్రాంతియు ప్రపంచబుద్ధియు కలుచుండుననియు, (ఇ) ముత్యపు చిప్పయందు గల్గిన రజతభ్రాంతి ఆ వెండితో మురుగులు మొదలైనవి చేసినొనుట కుపయోగింపనీయని విధముగ సంసారమునందు కల్గిన సుఖభ్రాంతి నిత్యసుఖము నీయలేదనియు, (ఈ) మంకెనపువ్వుల కాంతి చంద్రకాంతమణియందు ప్రతిబింబించి ఆ మణికి ఎర్రదనమును కలుగచేసినవిధముగ బ్రహ్మపదార్ధము జడమైన అంతఃకరణమందు ప్రతిబింబించి దానికి చైతన్యము గలుగచేయుననియు, (ఉ) కుడలవలె శరీరము లొక క్షణమున నశించుననియు వేదాంతశాస్త్రములోని మాటలు మాత్రము చెప్పుచుందురుగాని అనుభవము లేకుందురు. ఏ మాత్రమాపద కలిగినను వారు విచారపడుచుండుటయే వారికి అనుభవవిజ్ఞానము లేదన్టకు ప్రమాణము. 

తమనేత్రద్యుతిఁ దామె

తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా
విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా
రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!



శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా!