Pages

Sunday, September 12, 2010

దివిజక్ష్మా

దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా
నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం
డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!

 
శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు?

No comments:

Post a Comment