Pages

Tuesday, August 23, 2011

రాజై దుష్కృతిఁ

రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ
ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు. 

No comments:

Post a Comment